శేరిలింగంపల్లి, డిసెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూకట్‌పల్లి జోన్‌లో ఉన్న భాగ్యనగర్ (వార్డు నం.244), హైదర్ నగర్ (వార్డు నం.243) పేర్లలో జరిగిన పొరపాటును సరిచేయాలని కోరుతూ జోనల్ కమిషనర్ కు బీఆర్ఎస్ నాయకుడు, అడ్వకేట్ సిందం శ్రీకాంత్ పిటిషన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. ఎంఎస్. నం.266 (తేదీ: 08-12-2023) ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల వార్డుల పునర్వ్యవస్థీకరణ చేపట్టిన నేపథ్యంలో భౌగోళికంగా హైదర్ నగర్ ప్రాంతం భాగ్యనగర్ పేరుతో, భాగ్యనగర్ ప్రాంతం హైదర్ నగర్ పేరుతో నమోదు కావడం వల్ల ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం హైదర్ నగర్ అని పేరున్న వార్డు (243) లో హైదర్ నగర్ ప్రాంతం లేకుండా భాగ్యనగర్ ప్రాంతం ఉండగా, భాగ్యనగర్ అని పేరున్న వార్డు (244) లో భాగ్యనగర్ ప్రాంతం లేకుండా హైదర్ నగర్ ప్రాంతం ఉండడం పరిపాలనా పరంగా తప్పుదోవ పట్టించే పరిస్థితిని సృష్టిస్తోందని తెలిపారు. ఈ పేర్ల పొరపాటు కారణంగా ఓటర్ జాబితాలు, మున్సిపల్ సేవలు, అధికారిక రికార్డులు, ప్రజాప్రతినిధుల పరిధుల విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన వివరించారు. అందువల్ల ప్రజల సౌకర్యం, పరిపాలనా స్పష్టత దృష్ట్యా వార్డు నం.244కి హైదర్ నగర్ పేరు, వార్డు నం.243కి భాగ్యనగర్ పేరు పెట్టేలా మార్పిడి చేయాలని జోనల్ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి, త్వరితగతిన అవసరమైన సవరణ చేపడతారని ఆశిస్తున్నట్లు సిందం శ్రీకాంత్ పేర్కొన్నారు.





