సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేము – ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సైన్స్ డే

నమస్తే శేరిలింగంపల్లి: ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని ఊహించలేమని, సైన్స్ మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రీయ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర ఆచార్యులు జి.వెంకటయ్య అన్నారు. జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఐఐటీ, గేట్ కోచింగ్ బాలుర కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్‌ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్ర (సైన్స్) దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రీయ విశ్వవిద్యాలయ భౌతిక శాస్త్ర ఆచార్యులు జి.వెంకటయ్య హాజరై సర్.సి.వి.రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నదని, సైన్స్ అనేది ప్రజల కోసం ప్రగతి కోసం పనిచేస్తుందని అన్నారు. సైన్స్ దినోత్సవం ప్రధాన ఉద్దేశం రోజూ వారీ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు‌. సర్.సి.వి.రామన్ సైన్స్ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకోవడానికి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సర్.సి.వి.రామన్ ఆవిష్కరించిన పరిశోధన (పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అవి తమ స్వభావాన్ని మార్చుకుంటుందని తన పరిశోధన ద్వారా నిరూపించిన) రోజు ఫిబ్రవరి 28న ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం 1987 నుంచి సంవత్సరానికి ఒక నినాదంతో నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం నినాదం “సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ సమగ్ర విధానం” ద్వారా జరుపుకుంటున్నామని అన్నారు. సివి రామన్ పరిశోధనకు 1930 లో నోబెల్ బహుమతి వరించిందన్నారు. స్వాతంత్ర్యానంతరం సర్.సి.వి.రామన్ సైన్స్ రంగానికి చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని 1954 లో భారతరత్న బిరుదుతో సత్కరించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎల్లేని సత్యన్నారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రజిత, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ సభ్యులు గంగాధర్, భౌతికశాస్త్ర అధ్యాపకులు, కిరణ్, శ్రీకాంత్, విద్యార్థులు పాల్గొన్నారు.

జాతీయ సైన్స్ దినోత్సవంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ వెంకటయ్య
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here