నమస్తే శేరిలింగంపల్లి: హరితహారంతో కోట్ల నిధులను ఖర్చు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్లనాటి మహావృక్షాలను నరికివేయడం ఎంతవరకు సమంజసమని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ప్రశ్నించారు. శేరిలింగంపల్లి డివిజన్ పాత మున్సిపల్ కార్యాలయం ఆవరణలో బిజెపి నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయానికి చెట్ల కొమ్మలు అడ్డు వస్తున్నాయని ఏకంగా చెట్టునే తొలగించడం టీఆర్ఎస్ పాలనతీరు అద్దం పడుతుందన్నారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చెట్టును టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ నరికించడం పట్ల రవికుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో కోట్ల నిధులు వెచ్చించి మొక్కలు నాటే యజ్ఞాన్ని ప్రారంభించి ఇలా కార్యాలయాల వద్ద ఉన్న మహావృక్షాలను కొట్టివేయించడం ఏంటని ప్రశ్నించారు. వందలకాలం నాటి చెట్టును నరికివేయించిన ఘటనపై ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, రమేష్, గణేష్ ,వినోద్, చందర్ యాదవ్, విజయ్ కుమార్, బాబు, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.
