నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి జిల్లాలోని నిరుపేద అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శేరిలింగంపల్లి మండల పరిధిలోని ఇజ్జత్ నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి పేదలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకపోతే ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాన్ని గద్దె దించాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతుబంధు పథకాన్ని ఐదు ఎకరాల లోపు కలిగిన పేద రైతులకు మాత్రమే అమలు చేయాలని, దళిత బంధు పథకాన్ని అన్ని మండలాల్లో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, నియోజకవర్గ కార్యదర్శి టి. రామకృష్ణ, పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చందు యాదవ్, సీనియర్ నాయకులు వెంకటస్వామి, లింగం కాసిం, కృష్ణ, రాములు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.