నమస్తే శేరిలింగంపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన తీరును రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎండగట్టిన తీరును వ్యతిరేకిస్తూ రోడ్లెక్కి నిరసన తెలపాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్థన్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఅర్ రెండు సార్లు ముఖ్యమంత్రి కావడానికి కారణమైన రాజ్యాంగాన్నే మార్చాలని కేసీఆర్ అనడం, దానికి టీఆర్ఎస్ భజన చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తే టీఆర్ఎస్ నాయకులు జబ్బలు చరుచుకోవడం ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను విమర్శించడాన్ని కేసీఆర్, కేటీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం పై చేసిన అనుచిత వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే నిరసనల పేరుతో మరో కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాల పేరిట చేసిన తీర్మానం వల్ల రాష్ట్ర ఏర్పాటుకు ముందడుగు పడిందనే విషయాన్ని టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మరచి పోవద్దన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చింతకింది గోవర్ధన్ గౌడ్ డిమాండ్ చేశారు.