నమస్తే శేరిలింగంపల్లి: కేంద్రమే అధికారికంగా కుల గణన పేరిట బీసీ జనగణన చేపట్టాలని ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి తుకారాం నాయక్ డిమాండ్ చేశారు. ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కార్యాలయం తాండ్ర రామచంద్రయ్య భవన్ లో నిర్వహించారు. తుకారాం నాయక్ మాట్లాడుతూ భారత దేశంలో కులగణనకు 131 ఏళ్ల ఘన చరిత్ర ఉందని, 1931లో చివరిసారిగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కులగణన జరిపిందన్నారు. 1941లో జరిపిన లెక్కలలో కులాల సమాచారంతో పాటు జనాభా లెక్కలు సేకరించినప్పటికి 2 వ ప్రపంచ యుద్ధం కారణంగా కులాల సమాచారాన్ని క్రోడీకరించటం సాధ్యం కాలేదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా జనాభా లెక్కల అంశం కేంద్ర జాబితాలో చేర్చడం వలన కేంద్రమే అధికారికంగా జనాభా కమిషన్ ద్వారా జనాభా లెక్కలు సేకరించాలన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొదటిసారిగా 1951లో చేపట్టడం కులగణన చేపట్టిందన్నారు. అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన కులాలను మాత్రమే జనగణనలో చేర్చి బీసీ లను జనరల్ కేటగిరి కింద లెక్కించాలని నిర్ణయం తీసుకోవడం వలన అప్పటినుండి ఇప్పటివరకు బీసీ జనాభా లెక్కలు ఎవరికి అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, ఇతర సదుపాయాలు కల్పించాలని, జనాభా లెక్కలలో జనగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఎస్పీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మసురే నాగరాజు మాట్లాడుతూ బీసీ కుల గణన చేపట్టి బీసీలకు రావాల్సిన ఫలాలను అదించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఎస్పీ శేరిలింగంపల్లి ఇంఛార్జి రాములు, బీఎస్పీ శేరిలింగంపల్లి ఉప అధ్యక్షులు నర్సింగ్ ముదిరాజ్, లాలయ్య, వైవీ రమణ, పద్మశాలి సంఘం నాయకులు పల్లె మురళి, కన్న శ్రీనివాస్, అంగడి పుష్ప, తదితరులు పాల్గొన్నారు.
