నమస్తే శేరిలింగంపల్లి: సామాన్య రైతు కుటుంబంలో జన్మించి వెండితెర మీద, రాజకీయాల్లోనూ తనదైన రీతిలో చిరస్థాయి ముద్ర వేసుకున్న మహోన్నతుడు నటరత్న నందమూరి తారక రామారావు అని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. ఎన్టీఆర్ 26వ వర్థంతిని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నగర్ కాలనీలో గల ఎన్టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాల వేసి నివాళి అర్పించారు. మనిషి అంచలంచెలుగా ఎదగడానికి పట్టుదల, కృషి ఉంటే చాలని ఎన్టీఆర్ జీవితాన్ని చూస్తే అర్థమవుతోందని అన్నారు. తెలుగు ప్రజల ఆరాద్య దైవంగా ఎన్టీఆర్ నిలిచారని పేర్కొన్నారు. 60 ఏళ్ళ వయసులో రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయాలను సాధించారని గుర్తు చేశారు. సంక్షేమ పాలనతో చరిత్ర సృష్టించి ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని, చిత్తశుద్ధి ఉంటే చాలని నిరూపించారని చెప్పారు. మహిళలకు ఆస్తిహక్కు, బడుగు బలహీన వర్గాలకు పాలనాధికారాలు అప్పజెప్పిన, పేదలకు వినూత్న సంక్షేమ పథకాలు అందించిన సమసమాజ స్థాపనే ఎన్టీఆర్ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు బలరాం, గంగాధర్ రావు, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రావు, రమేష్, డేవిడ్, నరేంద్ర, మురళి, వెంకటేష్, శివ, బాబు రెడ్డి, రాంబాబు, సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.