నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్ప గార్డెన్ లో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. కాలనీ వాసుక విజ్ఞప్తి మేరకు శిల్ప గార్డెన్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పర్యటించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శిల్ప గార్డెన్ లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. కాలనీ వాసులు, ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకోని వారి విజ్ఞప్తి మేరకు కాలనీ లో పాదయాత్ర చేపట్టి క్షేత్ర స్థాయిలో స్వయంగా స్థానికుల సమస్యలను తెలుసుకున్నామని చెప్పారు. అక్కడికక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించగా డ్రైనేజీ సమస్యను త్వరలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీ, మంచి నీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ తదితర సమస్యలను కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గాంధీ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, ఏఈ సునీల్, మాజీ కార్పొరేటర్ రంగారావు, శిల్పగార్డెన్ వాసులు రామకిషోర్ యాదవ్, అపూర్వ శ్రీ వత్సవ, రాజశేఖర్, శ్రవణ్, సందీప్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
