నమస్తే శేరిలింగంపల్లి: వైశ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసి షావుకారులను అవమానించేలా మాట్లాడడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు సరికాదని శేరిలింగంపల్లి ఆర్యవైశ్యుల ఐక్య వేదిక కన్వీనర్ వెలగా శ్రీనివాస్ పేర్కొన్నారు. వైశ్యుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని ఖండిస్తూ చందానగర్ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం శేరిలింగంపల్లి ఆర్యవైశ్యుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వెలగ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక పూర్తి సామాజిక వర్గాన్ని అవమానించేలా మాట్లాడడం శోచనీయమన్నారు. కో కన్వీనర్ పసుమర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవ చేసిన కిరాణా వర్తకులను అవమానించడం దురదృష్టకరమన్నారు. మహిళా నాయకురాలు గాయత్రి మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాల వాణిజ్య అవసరాలను తీరుస్తూ సేవ చేస్తున్న వర్తకులను అవమానించడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వైశ్యులంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్నం సత్యనారాయణ, సంతోష్, కోటేశ్వరరావు, నగేష్, హరినాధ్, రవికిరణ్, వీరేష్, మనోజ్, లక్ష్మీ అన్నపూర్ణ, రాజశేఖర్, లక్ష్మణ్, నరేష్, తవిశి ప్రసాద్, సాయి ప్రసాద్, బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.