నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదాపీఠపాలిత శ్రీ వేంకటేశ్వరాలయ సముదాయంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక కళ్యాణ మహోత్సవం అదేవిధంగా మహా పుష్పయాగం నిర్వహించారు. శ్రీవారికి పంచామృతాభిషేకం, విశేషాలంకరణ, ప్రధాన హోమాలు, పూర్ణాహుతి, అన్నసమారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గోదాదేవి సమేత వేంకటేశ్వర స్వామికి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి వివిధ రకాల పూలతో మహా పుష్పయాగం నిర్వహించారు. తీరొక్క పూల నడుమ శ్రీనివాసుడు భక్తులకు కనువిందు చేశారు.
ఆలయ ప్రధానార్చకులు, పీఠం తెలంగాణ రాష్ట్ర ఆగమ సలహాదారు శ్రీ సుదర్శనం సత్యాసాయి ఆచార్యుల బృందం పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్ర పండితులు ఖండవల్లి సూర్య నారాయణ ఆచార్యుల ఆద్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఉత్సవ నిర్వహణ భక్తులు కైలా దేవెందర్‌రెడ్డి, భార్గవి దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు కె. రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి తూడి సుభాష్, ఉపాధ్యక్షులు తోట సుబ్బారాయుడు, పి.అశోక్‌గౌడ్, సభ్యులు వెంకట శేషయ్య, నాగేశ్వర్‌రావు, బ్రహ్మయ్య గుప్త, రాంగోపాల్, శ్రీకాంత్, ఆలయ సేవా సమితి సభ్యులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.