నమస్తే శేరిలింగంపల్లి: విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత చందానగర్ అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లోని షిరిడి సాయి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో శ్రీ షిర్డి సాయినాథ దేవాలయ దశమ వార్షికోత్సవాల్లో భాగంగా గురువారం ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తర పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వార్ల దివ్యాశీస్సులతో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు చేశారు.
గురువారం ఉదయం కాకడ హారతి, 108 లీటర్ల పాలతో అభిషేకం, అలంకరణ, అర్చనలు చేశారు. ఉదయం 10 గంటలకు పునః పూజ చండీహోమం పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సాయి హోమాలు, రాత్రి 7 గంటలకు లక్షపుష్పార్చన, శేజా హారతి నిర్వహించారు. సాయినాథునికి ప్రీతికరమైన వారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై సాయిబాబాను దర్శించుకున్నారు.