ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా – వల పన్ని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు- రూ. 40.50 లక్షల విలువ గల 81 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం

నమస్తే శేరిలింగంపల్లి:ఈజీ మనీకి అలవాటు పడి ఇతర రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చందానగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ క్యాస్ట్రో తో‌ కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరా‌నికి రూ. 40.50 లక్షల విలువ చేసే 81 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ ఓ టీ పోలీసులు, చందానగర్ పోలీసు బృందం సంయుక్తంగా వలపన్ని పట్టుకున్నారు.

పట్టుబడ్డ గంజాయి, వాహనాలతో నిందితులు

సైబరాబాద్‌ సీపీ ఆదేశాల మేరకు సైబరాబాద్‌ ఎస్‌ఓటీ బృందాలు గంజాయి స్మగ్లర్ల కోసం నిరంతరం నిఘా పెడుతున్నాయని‌ చెప్పారు. మహబూబాబాద్‌కు చెందిన పస్తం రాజు ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతంలోని చిన్న చిన్న గ్రామాల్లో ఇనుప మంచాలను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. మంచాలు అమ్మేందుకు ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుకు వెళ్లగా అక్కడ ఒరిస్సా రాష్ట్రం చిత్రకొండ బస్టాండ్‌లోని ఒక టీ స్టాల్‌లో ఒక గంజాయి ఏజెంట్‌ను కలుసుకున్నాడు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే దురాశతో తన సహచరులైన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం చింతలపల్లికి చెందిన యడ్ల వెంకట్ రెడ్డి, నెల్లికుదురు మండలం కాచికల్ కు చెందిన గంజి ప్రవీణ్ రెడ్డి సహాయంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పథకం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం బలిమెల సమీపంలోని చిత్రకొండ గ్రామం నుండి హైదరాబాద్‌కు గంజాయిని ఎడ్ల వెంకట్‌రెడ్డి, గంజి ప్రవీణ్‌రెడ్డి టిఎస్ 04 యుబి 2814 స్విఫ్ట్ డిజైర్ వాహనంలో 81 కిలోల గంజాయితో హైదరాబాద్‌కు వచ్చారు. విశ్వసనీయమైన పక్కా సమాచారంతో మాదాపూర్ జోన్ ఎస్ ఓ టీ, చందానగర్ పోలీసు బృందం సంయుక్తంగా నల్లగండ్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద వలపన్ని గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 40.50 లక్షల విలువైన 81 కిలోల బరువున్న 2.2 కిలోల చొప్పున ఉన్న 37 ప్యాకెట్లను, మూడు సెల్ ఫోన్లను, అశోక్ లేలాండ్ గూడ్స్ క్యారియర్, మారుతి స్విప్ట్ డిజైర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్, మాదాపూర్ ఎస్ ఓ‌ టీ, చందానగర్ పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాదాపూర్ ‌డీసీపీ శిల్పవల్లి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here