నమస్తే శేరిలింగంపల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి రూ.55 లక్షల విలువైన 265 కిలోల గంజాయిని, రూ. 3200 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ వద్ద ఈ గంజాయి ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. ఒక ట్రక్ టూల్ బాక్స్ లో ఒడిస్సా నుండి మీరట్ వయా హైదరాబాద్ మీదుగా గంజాయిని తరలిస్తున్నారన్నారు. ఒడిస్సాలో కేజీ గంజాయి రూ.8 వేలకు కొనుగోలు చేసి మీరట్ లో రూ.15 వేలకు అమ్మడానికి మహమ్మద్ ఇక్ బాల్, షారుక్, సలీమ్ అనే నిందితులు ప్లాన్ చేశారని తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఒక ట్రక్ బేరింగ్, 265 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, రూ. 3200 నగదు స్వాధీనం చేసుకున్నామని, బాబులాల్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి రవాణా, మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతున్నామని ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని డీసీపీ శిల్పవల్లి హెచ్చరించారు.