సైబరాబాద్‌లో బాలల అభిప్రాయాలకు పెద్దపీట.. 76 వార్డుల్లో 4,122 మంది చిన్నారులతో CMC సంప్రదింపులు

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 23 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్‌ను బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) చేపట్టిన లిసనింగ్ టు చిల్డ్రన్ – చైల్డ్ ఫ్రెండ్లీ CMC కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. UNICEF సాంకేతిక సహకారంతో ఆదివారం (నవంబర్ 22) కార్పొరేషన్ పరిధిలోని అన్ని వార్డుల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సంప్రదింపుల్లో 4,122 మందికి పైగా చిన్నారులు పాల్గొని పట్టణ పాలన, స్థానిక సమస్యలు, మౌలిక సదుపాయాలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని CMC పరిధిలోని 3 జోన్లు, 16 సర్కిళ్లు, 76 వార్డుల్లో నిర్వహించారు. ప్రతి వార్డులో భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి ఇద్దరు నుంచి ముగ్గురు శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్లను (RPs) నియమించారు. ఒక్కో వార్డులో కనీసం 50 మంది చిన్నారుల అభిప్రాయాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా రిసోర్స్ పర్సన్లు పార్కులు, ఆటస్థలాలు, పాఠశాలలు, నివాస ప్రాంతాలు, స్థానిక కమ్యూనిటీ కేంద్రాలను సందర్శించి చిన్నారులతో నేరుగా మాట్లాడారు.

UNICEF బృందం రూపొందించిన ప్రత్యేక చైల్డ్ ఫ్రెండ్లీ వార్డ్ చెక్‌లిస్ట్ (టూల్–1) ద్వారా చిన్నారుల అభిప్రాయాలను సేకరించారు. వారి నిత్యజీవితం, భద్రత, పర్యావరణం, పట్టణ మౌలిక సదుపాయాలు తదితర అంశాలకు సంబంధించిన 12 ప్రధాన అంశాలను ఇందులో చేర్చారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేందుకు తెలుగు, ఆంగ్ల భాషల్లో ప్రశ్నావళిని అందుబాటులో ఉంచారు. CMC పరిధిలోని 76 వార్డుల నుంచి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు, అభివృద్ధికి సంబంధించిన సూచనలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్న దృశ్యాలు, ఫొటోలు, వీడియోలను CMC అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లోనూ పంచుకున్నారు.

మొదటి దశలో టూల్-1 ద్వారా క్షేత్రస్థాయి సమాచార సేకరణ పూర్తికాగా, తదుపరి ఫేజ్–2, ఫేజ్–3 కార్యక్రమాలను నిర్వహించేందుకు CMC అధికారులు, సాంకేతిక బృందాలు ప్రణాళికలు రూపొందించనున్నాయి. ఇందులో భాగంగా మరిన్ని ప్రశ్నావళి ఆధారిత సంప్రదింపులు, గ్రూప్ డిస్కషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. చిన్నారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సమస్యలు, సూచనలను వివిధ అంశాల వారీగా వర్గీకరించి, భవిష్యత్తులో సైబరాబాద్ పరిధిలో చేపట్టే పట్టణ ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాల్లో వాటికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చిన్నారుల అవసరాలు, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ వారి భాగస్వామ్యంతోనే పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని CMC అధికారులు తెలిపారు. బాలల భద్రత, సంక్షేమం, సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ సైబరాబాద్‌ను బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దేందుకు తదుపరి దశల కార్యక్రమాలను కూడా త్వరలో చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here