శేరిలింగంపల్లి, నవంబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడలో ఉన్న అంబీర్ చెరువుకు మహర్దశ పట్టనుంది. చెరువు సుందరీకరణ, అభివృద్ధి పనులకు హైడ్రా ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో PAC చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైడ్రా అధికారులు, మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. అంబీర్ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే చెరువును అన్ని హంగులతో సుందర శోభిత వనంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కాలనీవాసులు, పరిసర ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.

చెరువు ఆక్రమణలను తొలగించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని గాంధీ వెల్లడించారు. చెరువు పరిధిలోని కబ్జాలు, అక్రమ నిర్మాణాలను తొలగించి పూర్తిస్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుచించుకుపోయిన చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతోపాటు నాలాల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపడతామన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. అంబీర్ చెరువును స్కైవాక్, వాకింగ్ ట్రాక్‌లు, పచ్చని ఉద్యానవనాలు, రాత్రివేళ విద్యుత్ దీపాలంకరణతో సరికొత్త రూపంలో అభివృద్ధి చేయనున్నట్లు గాంధీ వివరించారు. చెరువులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు పచ్చదనాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తామని చెప్పారు. కాంక్రీట్ నిర్మాణాల మధ్య చెరువుల సుందరీకరణ ద్వారా ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు. చెరువుల పరిరక్షణతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు జలవనరులను అందించవచ్చని పేర్కొన్నారు.
తన సొంత నిధులతో పలు చెరువుల సుందరీకరణ పనులు చేపట్టినట్లు గాంధీ తెలిపారు. గంగారం, పటేల్ చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులు చేపట్టామని వెల్లడించారు. గంగారం, పటేల్ చెరువులతో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 64 చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఆరోగ్యకరమైన శేరిలింగంపల్లి నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రజలందరూ చెరువుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు యూనస్, నరేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.





