శేరిలింగంపల్లి, అక్టోబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాదబ్రహ్మోత్సవం-26 తొమ్మిదో రోజు కార్యక్రమం భక్తి సంగీత వైభవంతో అలరించింది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీనిధి స్వరార్చనలో ప్రముఖ నేపథ్య గాయని శ్రీనిధి తిరుమల అన్నమాచార్య సంకీర్తనలను మధురంగా ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారంలో పద్మశ్రీ డాక్టర్ శోభారాజు చేస్తున్న సేవలు చిరస్మరణీయమని ముఖ్య అతిథులు కొనియాడారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, లలితా సహస్రనామ పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శ్రీనిధి తిరుమల అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఆలపించిన కీర్తనలతోపాటు, డాక్టర్ శోభారాజు స్వరకల్పన చేసిన సంకీర్తనలను ఆమె వినిపించారు.

ఆమెతో ఏమి, జగదానంద కారక, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మమొక్కటే, అదివో అల్లదివో తదితర సంకీర్తనలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ స్వరార్చనకు రాజేశ్వరరావు కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి, తెలుగు టైమ్స్ సంపాదకుడు చెన్నూరు సుబ్బారావు అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. పది రోజుల పాటు అన్నమయ్య సంకీర్తనలతో స్వామివారిని వివిధ రూపాల్లో ఆరాధించే ఇలాంటి విశిష్ట కార్యక్రమాన్ని అన్నమయ్యపురంలో నిర్వహించడం డాక్టర్ శోభారాజు అంకితభావానికి నిదర్శనమని అన్నారు. అన్నమయ్య సంకీర్తనలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, అనేకమంది యువ కళాకారులకు వేదిక కల్పించి ప్రోత్సహిస్తున్న శోభారాజు, అన్నమాచార్య భావనా వాహిని సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సంస్థతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
చెన్నూరు సుబ్బారావు మాట్లాడుతూ.. ఆర్థిక లాభనష్టాలు, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా అన్నమయ్య సంకీర్తనల ప్రచారాన్నే జీవిత లక్ష్యంగా చేసుకుని డాక్టర్ శోభారాజు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. సొంత వనరులను వెచ్చిస్తూ ఎన్నో సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనల సేవను కొనసాగిస్తున్న అన్నమాచార్య భావనా వాహిని ఆదర్శప్రాయమైన సంస్థ అని అన్నారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారమే కొనసాగిస్తానని స్వామివారికి ఇచ్చిన మాటను దశాబ్దాలు గడిచినా నిలబెట్టుకుంటూ శోభారాజు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా భక్తిని, ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువ కళాకారుల ప్రతిభను వెలికితీసి వారికి ప్రోత్సాహం అందించడం అన్నమాచార్య భావనా వాహిని ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు.





