శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఇజ్జత్నగర్ డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్లో ఉన్న ఉదయ క్రెసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులతో కలిసి కార్పొరేటర్ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. పండుగ వాతావరణంతో ఉదయ క్రెసెంట్ సందడిగా మారింది.

ఈ సందర్భంగా గంగల రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. మన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇటువంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలు స్థానికుల మధ్య ఐక్యతను, తెలంగాణ సంస్కృతి పట్ల వారికున్న అభిమానాన్ని చాటిచెప్పాయి.






