శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం-26 ఏడవ రోజు సంగీత కార్యక్రమం భక్తి సంగీత మాధుర్యంతో అలరించింది. అక్టోబర్ 17న నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని వారణాసి సౌమ్య అన్నమయ్య సంకీర్తనలను మధురంగా ఆలపించి సంగీతాభిమానులను ఆకట్టుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, అన్నమాచార్య అష్టోత్తరం, శ్రీ లలితా సహస్రనామ పారాయణాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం వారణాసి సౌమ్య నగవులు, భావయామి, వందేహం జగద్గురుం, కొండల్లో నెలకొన్న, చాలదా హరినామ తదితర సంకీర్తనలను ఆలపించి భక్తులను పరవశింపజేశారు. అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు సంయుక్తంగా చిత్తము కొలది, హరి అవతారమితడు వంటి సంకీర్తనలను భక్తిభావంతో ఆలపించారు. ఈ కార్యక్రమానికి రాజు కీబోర్డుపై, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు.

ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖ అతిథులు అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న సేవలను అభినందించారు. అన్నమయ్య సంకీర్తనలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కళాకారులకు వేదికలు కల్పిస్తూ, భక్తి సంగీత వైభవాన్ని భావితరాలకు అందించడంలో పద్మశ్రీ డాక్టర్ శోభారాజు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. నాదబ్రహ్మోత్సవం-26లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న దుర్గాష్టమి ప్రత్యేక కార్యక్రమంలో విశిష్ట సేవలు అందించిన మహిళకు ప్రదానం చేసే ధైర్య పురస్కారాన్ని సిద్ధచక్ర రీసెర్చ్ సెంటర్కు చెందిన డాక్టర్ భువనగిరి సత్య సింధుజకు అందించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇదే వేదికపై డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి నవ వైష్ణవ బిరుదును కూడా అందజేయనున్నారు.
ఈ ప్రత్యేక వేడుకలకు భక్తులు, సంగీతాభిమానులు, కళాప్రియులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నమాచార్య భావనా వాహిని నిర్వాహకులు కోరారు. అన్నమయ్య సంకీర్తనల వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, దివ్య సంగీతం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే నాదబ్రహ్మోత్సవం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు.





