శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం చెరువు, తారానగర్లో నిర్వహించిన వేడుకల్లో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు, శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ పూల సంబురం, పుడమి సంబురం, ఆడపడుచుల ఆనందోత్సవాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలు తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలనే దేవతగా పూజించే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని తెలిపారు. బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ అని, ఆడపడుచులకు అపురూపమైన వేడుక అని గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పూల పండుగ మహిళల ఐక్యతను, ప్రకృతితో మానవ జీవనానికి ఉన్న అనుబంధాన్ని చాటిచెబుతుందని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ సంతోషంగా, సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.






