శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాదబ్రహ్మోత్సవం-26లో భాగంగా దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వైద్యురాలు, సిద్ధచక్ర రీసెర్చ్ సెంటర్కు చెందిన డా. సత్య సింధుజకు ధైర్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్ డా. డి. నాగేశ్వర్ రెడ్డికి నవ వైష్ణవ బిరుదును అందజేశారు. దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక సంగీత కార్యక్రమంలో అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు చిత్తము కొలది, అంబికే జగదంబికే తదితర అన్నమయ్య సంకీర్తనలను ఆలపించి భక్తులను అలరించారు. అజయ్ తబలాపై, రాజు కీబోర్డుపై వాయిద్య సహకారం అందించారు. ప్రతి సంకీర్తనలోని అంతరార్థం, భక్తిభావం, ఆధ్యాత్మిక సందేశాన్ని పద్మశ్రీ డా. శోభారాజు వివరించారు.

డా. శోభారాజు వ్యాఖ్యానాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో అన్నమాచార్య భావనా వాహిని చేస్తున్న కృషిని కొనియాడారు. అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడంతోపాటు, వాటి అర్థాలను ప్రజలకు వివరించి, ఆ సాహిత్య గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో డా. శోభారాజు విశిష్ట పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారం కోసం ఆమె చేస్తున్న నిరంతర సేవలు చిరస్మరణీయమని అన్నారు. వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి ధైర్య పురస్కారాలతో గౌరవించడం అభినందనీయమని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న డా. డి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డా. శోభారాజుతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి అంకితమవడమే కాకుండా, అన్నమయ్యకు ప్రత్యేక ఆలయాన్ని నిర్మించడం విశేషమని ప్రశంసించారు.

వైద్యవృత్తిలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు సంగీతం తనకు ఎంతో ప్రశాంతతను అందిస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా డా. శోభారాజు గానం తనకు ఎంతో ఇష్టమని, కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో వంటి అన్నమయ్య సంకీర్తనలు తనకు అత్యంత ప్రియమైనవని వెల్లడించారు. ఆమె గానంపై, అన్నమాచార్య భావనా వాహిని నిర్వహిస్తున్న కార్యక్రమాలపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని పేర్కొన్నారు. ధైర్య పురస్కార గ్రహీత డా. సత్య సింధుజ మాట్లాడుతూ అన్నమాచార్య భావనా వాహిని వేదికపై పద్మశ్రీ డా. శోభారాజు సమక్షంలో ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని అమ్మవారి అనుగ్రహంగా భావిస్తున్నానని తెలిపారు. వైద్యరంగంలో నిరంతరం కృషి చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కి ఈ స్థాయికి చేరుకున్నానని, ఈ పురస్కారం తనకు మరింత ముందుకు సాగేందుకు ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాననే విశ్వాసం కలిగిందన్నారు. తన సేవలను గుర్తించి పురస్కారంతో గౌరవించిన డా. శోభారాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు పద్మశ్రీ డా. శోభారాజు మాట్లాడుతూ డా. సత్య సింధుజకు ధైర్య పురస్కారాన్ని అందించడం సంస్థకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. విదేశీ పర్యటన ఉన్నప్పటికీ కార్యక్రమంలో పాల్గొనేందుకు తమ పర్యటనను వాయిదా వేసుకుని విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు, డా. నాగేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య సంకీర్తనల ప్రచారంతోపాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి గౌరవించడం, కళాకారులకు తగిన వేదికలు కల్పించడం సంస్థ ముఖ్య లక్ష్యాలని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను, ఇతర ప్రముఖులను, కళాకారులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దీంతో దుర్గాష్టమి సందర్భంగా నిర్వహించిన నాదబ్రహ్మోత్సవం కార్యక్రమం భక్తి, సంగీతం, సేవాభావంతో ముగిసింది.
నాదబ్రహ్మోత్సవం-26లో భాగంగా మరుసటి రోజు ప్రముఖ నేపథ్య గాయని శ్రీనిధి తిరుమల సంగీత కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు, సంగీతాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నమాచార్య భావనా వాహిని ఆహ్వానించింది.





