శేరిలింగంపల్లి, అక్టోబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మాదాపూర్లోని శిల్పారామంలో మహిళా సిబ్బంది బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళా సిబ్బంది రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సాయంత్రం సందర్శకులతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. సంప్రదాయ పాటలు, ఆటలతో ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా భువనేశ్వర్ నుంచి విచ్చేసిన రోజ్లిన్ మోహాపాత్ర తన శిష్య బృందంతో ఒడిస్సీ నృత్య ప్రదర్శన ఇచ్చారు. భో శంభో, జనసమ్మోహినీ పల్లవి, యుగే యుగే జగన్నాథ్ అంశాలపై అనుష్క, సలోని, అర్పిత, పల్లవి, సాయి స్నేహ, సాయి శ్రాధ తమ నృత్యాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అనంతరం యశస్వినిశ్రీ బృందం ప్రదర్శించిన త్రిదేవి కూచిపూడి నృత్య రూపకం విశేషంగా అలరించింది. లక్ష్మి, పార్వతి, సరస్వతి దేవతలు దుష్టశిక్షణ కోసం దుర్గాదేవిగా అవతరించే ఘట్టాలను కళాకారులు అద్భుతంగా ఆవిష్కరించారు. లక్ష్మి ప్రియా, కార్తీక, దీప, అనూష, జోషిత, హాసిని తదితరులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సద్దుల బతుకమ్మ వేడుకలతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు శిల్పారామం సందర్శకులకు పండుగ సందడితోపాటు కళాత్మక అనుభూతిని అందించాయి.






