శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మియాపూర్‌లో బీఆర్‌ఎస్ నాయకుడు అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ కానుకలు పంపిణీ చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ తొలి రోజు సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆర్‌వీ అవనీంద్ర, అరబిందో కాలనీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రత్యేకంగా కానుకలు అందజేశారు. తెలంగాణ ఆడపడుచులను ఆప్యాయంగా గౌరవిస్తూ, పండుగ సందర్భంగా కానుకలు పంపిణీ చేయడంతో కాలనీల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 300 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ, ప్రతి కాలనీలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తూ, మహిళలతో కలిసి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, స్థానిక నివాసితులు, మహిళలు, ఏఆర్‌పీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.






