శేరిలింగంపల్లి, అక్టోబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో కలిసి జయప్రకాశ్ నారాయణ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా హక్కుల సాధన కోసం జయప్రకాశ్ నారాయణ్ చేసిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడం, అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, ప్రజల సంక్షేమం కోసం జయప్రకాశ్ నారాయణ్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ నారాయణ్ నగర్ కాలనీ అధ్యక్షుడు మోహన్ రావుతో పాటు కాలనీవాసులు శ్రీధర్ చారి, జగదీశ్వర్, లక్ష్మారెడ్డి, వెంకట్రావు, మోహన్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, శ్రీనివాస్, నరేందర్, రమేష్, రాఘవరావు, శ్రీనివాస్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.





