శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) స్టాండింగ్ కమిటీ 8వ సాధారణ సమావేశం సోమవారం CMC ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో CMC కమిషనర్ సృజనతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ మౌలిక వసతులు, రహదారులు, చెరువుల అభివృద్ధి, పౌర సేవలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను కమిటీ పరిశీలించి ఆమోదించింది. సమావేశంలో చింతల్ కుంట చెరువు పునరుజ్జీవనం, అభివృద్ధి పనులకు రూ.21.59 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇందులో పూడికతీత, చెరువు కట్టల రక్షణ, నీటి నాణ్యత పునరుద్ధరణతో పాటు నార్లకుంట చెరువుకు అనుసంధానించే బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

అలాగే కూకట్‌పల్లి జోన్‌లో SNDP బాక్స్ డ్రెయిన్ పనులకు రూ.5.95 కోట్లు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించారు. ట్రెండ్జ్ జూనియర్ నుంచి వాషిణవి ప్రైడ్ అపార్ట్‌మెంట్ వరకు ఇప్పటికే ఉన్న బాక్స్ డ్రెయిన్‌కు అనుసంధానంగా మిగిలిన నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దుర్గం చెరువు పరిధిలో సుమారు 140 ఎకరాల్లో సమగ్ర లేక్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవనం కోసం ప్రత్యేక ప్రయోజన సంస్థ (SPV) ఏర్పాటు ప్రతిపాదనకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది. గాజులరామారం సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి రూ.5.18 కోట్లు, హిందూ–ముస్లిం గ్రేవ్‌యార్డ్ నుంచి ఆల్విన్ కాలనీ సర్కిల్ సరిహద్దు వరకు మోడల్ రోడ్డు అభివృద్ధికి రూ.2.95 కోట్లు అంచనా వ్యయంతో ప్రతిపాదనలను ఆమోదించారు. మున్సిపల్ సమస్యలకు సాంకేతిక, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడం, ప్రోటోటైపింగ్ చేపట్టడం కోసం T-Works Foundationతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం (MoU)కు సంబంధించిన చర్యలకు కూడా కమిటీ ఆమోదం తెలిపింది.
ఇవేకాకుండా మున్సిపల్ మౌలిక వసతులు, నిర్మాణ–కూల్చివేత (C&D) వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్యం, ఇంధన నిర్వహణ, పౌర సేవలకు సంబంధించిన పలు ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు. జీడిమెట్ల C&D వ్యర్థాల ప్రాసెసింగ్ సదుపాయం, మున్సిపల్ స్థాయిలో బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చాయి. కార్పొరేషన్ పరిధిలో మౌలిక వసతులను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, అభివృద్ధి పనులను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే దిశగా స్టాండింగ్ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.





