శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండలో ప్రతిపాదిత 100 ఫీట్ల రోడ్డు విస్తరణకు స్థానికుల నుంచి అంగీకారం లభించింది. రోడ్డు విస్తరణలో భాగంగా స్థలాలు, భవనాలు కోల్పోతున్న వారికి అంగీకార పత్రాలను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీలు ప్రసిద్ధ, సుష్మ, హబీబా, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. మసీదుబండ రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో 120 అడుగులుగా ఉన్నప్పటికీ, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తన ప్రత్యేక చొరవతో 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు గ్రామస్థులు అంగీకరించారని తెలిపారు. స్థలాలు కోల్పోతున్న వారిని ఒప్పించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చేశామని చెప్పారు.

రోడ్డు విస్తరణలో స్థలాలు, భవనాలు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ సముచిత న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. జీవనాధారాన్ని కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూడాలని, అర్హులైన వారందరికీ TDR అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. TDR ప్రక్రియను వేగవంతం చేసి వారం రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుల వివరాలను సేకరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మసీదుబండ రోడ్డు విస్తరణ సమస్యకు ప్రస్తుతం పరిష్కారం లభించడం ఉపశమనకరమని గాంధీ పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పూర్తయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
తారానగర్, అంజయ్యనగర్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న వారికి కూడా TDR అందేలా చర్యలు తీసుకోవాలని గాంధీ సూచించారు. వారం రోజుల్లో TDR ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేలా రోడ్ల విస్తరణతోపాటు ప్రత్యామ్నాయ రహదారులు, లింక్ రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గాంధీ సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మసీదుబండ వాసులు తదితరులు పాల్గొన్నారు.





