శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలిచింది. ఈ ప్రజావాణిలో మొత్తం 41 ఫిర్యాదులు అందాయి. వీటిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ శాఖకు సంబంధించిన 36 ఫిర్యాదులు ఉన్నాయి. శాఖల వారీగా టౌన్ ప్లానింగ్‌కు 36, ఇంజినీరింగ్‌కు 2, ఎలక్ట్రికల్‌కు 1, ల్యాండ్ అక్విజిషన్‌కు 1, స్పోర్ట్స్ శాఖకు 1 ఫిర్యాదు అందినట్లు సీఎంసీ అధికారులు తెలిపారు.

ప్రజావాణిలో స్వీకరించిన అన్ని వినతులు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పరిశీలన కోసం పంపించారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని, నిర్దేశిత గడువులో అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజావాణిలో అందిన ప్రతి వినతికి ప్రత్యేక గ్రీవెన్స్ ఐడీ, ట్రాకింగ్ లింక్ కేటాయించనున్నారు. వీటి ద్వారా ఫిర్యాదుదారులు తమ సమస్యపై తీసుకుంటున్న చర్యలు, ఫిర్యాదు పరిష్కార పురోగతిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా సీఎంసీ ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించడం, శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టడం, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సీఎంసీ పేర్కొంది.





