శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): పీజేఆర్ స్టేడియంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా సమావేశం శనివారం ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. తొలి రోజు కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకుడు, అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అట్టేపల్లి రామప్రభు ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులు, PET ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా క్రీడా పోటీల్లో పాల్గొంటున్న 60 మంది PET ఉపాధ్యాయులకు అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్రభు టీ-షర్ట్లు, క్యాప్‌లను అందజేశారు. క్రీడా రంగానికి సేవలందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించిన ఆయన.. క్రీడల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

అనంతరం మైదానంలో టాస్ వేసి క్రీడా పోటీలను రామప్రభు అధికారికంగా ప్రారంభించారు. క్రీడాకారులతో ముచ్చటించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మియాపూర్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ వసుంధర, ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ యూసఫ్ ఖాన్, SGF సెక్రటరీ నిర్మలతో పాటు శేరిలింగంపల్లి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ARP టీమ్ సభ్యులు పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ క్రీడా సమావేశం విద్యార్థులు, క్రీడాకారుల్లో పోటీతత్వం, క్రమశిక్షణ, టీమ్ స్పిరిట్‌ను పెంపొందించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.





