రవీంద్రభారతిలో ఘనంగా నాట్య గణపతి నాట్య పుష్పాంజలి అవార్డుల ప్రదానోత్సవం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నాట్య గణపతి నాట్య పుష్పాంజలి అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకుడు బి. నాగేంద్ర యాదవ్, కార్యక్రమ ఇన్‌ఛార్జ్ బి. దివ్యలక్ష్మి పర్యవేక్షణలో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలను వీక్షించిన అతిథులు వారిని అభినందించారు.

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య, బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో తమ కలలు, ఆసక్తుల పట్ల అవగాహన పెంచాలని సూచించారు. కళల్లో నాట్యానికి ప్రత్యేక స్థానం ఉందని, నాట్యరంగంలో ప్రావీణ్యం సాధిస్తే దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో నాట్య కళాకారులకు ఎంతో ప్రాధాన్యత ఉండేదని, రవీంద్రభారతిలో అనేక నాట్య పోటీలు నిర్వహించిన విషయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. నాట్యకళను ప్రోత్సహిస్తూ కళాకారులను ముందుకు తీసుకెళ్తున్న శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థను వారు అభినందించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌లకు నిర్వాహకులు నాట్య గణపతి అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here