శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని జాతీయ రహదారి NH-65పై శ్రీదేవి థియేటర్ రోడ్డు నుంచి అమీన్‌పూర్ వరకు చేపట్టనున్న రహదారి విస్తరణ పనులను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. సుమారు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో 2.7 కిలోమీటర్ల మేర 4 లేన్ల రహదారి, 2 లేన్ల సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఎంపీ రఘునందన్ రావు, CMC కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డీసీ శ్రీనివాస్, CCP వెంకన్న, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ప్రాజెక్ట్స్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్ విభాగాల అధికారులతో కలిసి గాంధీ పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాపై నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో ఉంచుకుని కల్వర్టు నిర్మాణం చేపట్టాలని, నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని గాంధీ సూచించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడరాదని, అలసత్వం లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గాంధీ తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. జాతీయ రహదారి నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు అనుసంధానించే లింక్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడం ద్వారా ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణలో భాగంగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులకు సూచించారు. రహదారి విస్తరణ పనులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గి ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుందని గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





