శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): పద్మశ్రీ డాక్టర్ శోభారాజు ఆరోగ్య శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఆమె శిష్యులు ప్రత్యేకంగా సంకీర్తనలు ఆలపించారు. గత రెండు రోజులుగా తలకు గాయం కావడంతో హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో శోభారాజు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న శిష్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం అన్నమయ్యపురంలో నిర్వహించిన అన్నమ స్వరార్చన కార్యక్రమంలో శోభారాజు త్వరగా కోలుకోవాలని దైవ ప్రార్థనలు చేశారు. అనంతరం కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి ఆమె ఆరోగ్యంగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ అన్నమాచార్యుల ఔషధ సంకీర్తనలుగా భావించే పొడగంటిమయ్యా, కొనరో కొనరో, సకల శాంతికరము తదితర సంకీర్తనలను ఆలపించారు.

సంకీర్తనల అనంతరం స్వామివారికి వందనం సమర్పించి, శోభారాజు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రార్థించారు. అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు జయశ్రీ, అక్షయ్, సౌజన్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరగా మంగళహారతి, తీర్థ ప్రసాదాల పంపిణీతో కార్యక్రమం ముగిసింది.





