శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19 (నమస్తే శేరిలింగంపల్లి): గంగారం ప్రాంతంలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో నాసిరకం, కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు ఉన్న జ్యూస్ బాటిళ్లు, దుర్వాసన వస్తున్న కుళ్లిన ఐస్‌క్రీములు, కాలం చెల్లిన పలు ఉత్పత్తులు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.

ఈ విషయంపై సూపర్‌మార్కెట్ సిబ్బందిని నిలదీయగా సరైన సమాధానం ఇవ్వలేదని బాధిత వినియోగదారులు పేర్కొన్నారు. నాసిరకం ఉత్పత్తుల విక్రయంపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. దీంతో సమస్యను మీడియా దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. వినియోగదారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అనుమానాస్పద ఆహార ఉత్పత్తుల నమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






