ఆదర్శ్‌నగర్‌లో సేవా సంకల్ప్ అభియాన్.. 1000 మందికి అన్న ప్రసాద వితరణ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఆదర్శ్‌నగర్ యూత్ అసోసియేషన్ గణనాథ మండపం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకుడు చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా చింతకింది గోవర్ధన్ గౌడ్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ఐదు గణనాథ మండపాల వద్ద అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించేందుకు సంకల్పించడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుని బీజేపీ నాయకులు, మోదీ అభిమానులు వాడవాడలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని నందకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. అనంతరం చింతకింది గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పేరిట అన్న ప్రసాద వితరణ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ్‌నగర్ కాలనీ యూత్, లింగంపల్లి రైన్ ట్రీ కమ్యూనిటీ, గోపీనగర్ భ‌జరంగ్ యూత్, ప్రశాంత్‌నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని గణనాథ మండపాల వద్ద మొత్తం సుమారు 6 వేల మందికి పైగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రాఘవేంద్రరావు, నాగేశ్వరరావు, రంగా గౌడ్, బెజగం కేశవులు, పుట్ట వినయకుమార్ గౌడ్, గోపాల్ యాదవ్, శ్రీనివాస్ నాయి, రవీందర్ రెడ్డి, అల్లూరయ్య, శ్రీనివాసరావు, అరుణ్ గౌడ్, డాకయ్య గౌడ్, కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here