శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): బీఆర్ఎస్ తరఫున గెలిచి అనంతరం కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలక పరిణామమని ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన తర్వాత ప్రజా తీర్పును పక్కనపెట్టి పార్టీ మారడం ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని రవీందర్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం, రాజ్యాంగ నిబంధనల ప్రాధాన్యత మరోసారి స్పష్టమైందన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా దానం నాగేందర్ వ్యవహారంపై వచ్చిన తీర్పు హెచ్చరికగా భావించాలని రవీందర్ యాదవ్ అన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా పార్టీ మారిన వారంతా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా అధికార బలాన్ని పెంచుకోవచ్చని భావిస్తే.. తాజా పరిణామాలు ఆ విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అన్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ విషయంలోనూ త్వరలోనే అనర్హత వేటు పడుతుందని చిర్రా రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో శేరిలింగంపల్లిలో ఉప ఎన్నికకు పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకుని ప్రజల తీర్పును గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. అధికారం శాశ్వతం కాదు.. ప్రజల తీర్పే అంతిమం. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు.





