సంగారెడ్డిలో USFI భారీ ర్యాలీ.. 3,000 మంది విద్యార్థులతో ప్లీనరీ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 18 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో USFI తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్లీనరీ సందర్భంగా సుమారు 3,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి USFI జాతీయ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాదం తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి తాటికొండ రవి, జాతీయ సలహాదారు మాదంశెట్టి అరుణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధికి మాత్రం తగినన్ని నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.10 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. MBBS సీట్లలో నాలుగు సంవత్సరాల చదువును మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని స్థానికతను నిర్ణయించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని కోరారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ప్రతి ఉమ్మడి జిల్లాకు కనీసం ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని USFI నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే విద్యార్థులు, ప్రజలను సమీకరించి USFI ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నార్ల చంద్రశేఖర్, మోర్తాల చందర్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందులాపురం మధు, రాజేష్, గణేష్, వెంకటేష్, మిట్టపల్లి తిరుపతి, సహాయ కార్యదర్శులు గుడికందుల రవి, నాచారం శేఖర్, ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here