శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని హఫీజ్పేట్ డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. హఫీజ్పేట్ గ్రామం చౌరస్తాలోని బావర్చి హోటల్ వద్ద హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సంస్థాన విమోచన కోసం పోరాడిన యోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కైతాపురం జితేందర్ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనంలో అప్పటి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో చేపట్టిన చారిత్రాత్మక ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైందని జితేందర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం కురుమ, హఫీజ్పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షుడు శివాజీ, బీజేపీ నాయకులు మనోజ్ యాదవ్, యువ మోర్చా అధ్యక్షుడు మహేష్ గౌడ్, నాయకులు కార్తీక్, చందు, గోవింద్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.





