శేరిలింగంపల్లి, సెస్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి ఎక్స్‌టార్షన్ (బలవంతపు వసూళ్లు) కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు కఠినంగా హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై అసభ్యంగా ప్రవర్తించడం, బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల చర్యలకు పాల్పడటం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని వారికి తెలిపారు. ఎవరైనా ఎక్స్‌టార్షన్‌కు పాల్పడినా, బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకర చర్యలకు పాల్పడి ప్రజలకు ఇబ్బంది కలిగించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓతో పాటు ఎస్‌ఐలు నిర్వహించారు.






