కేటీఆర్ చేతుల మీదుగా సీడ్ గణపతి పంపిణీ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, సెస్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు వినాయక చవితి వేడుకలను ప్రకృతి హితంగా నిర్వహించాలనే లక్ష్యంతో చేపట్టిన సీడ్ గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సీడ్ గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. పర్యావరణం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాల‌ను చేపట్టడం మంచి నిర్ణయం అని పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు చిర్రా రవీందర్ యాదవ్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

చిర్రా రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకల్లో భక్తి భావంతో పాటు పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 5,000 సీడ్ గణపతి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. మట్టి, సహజ పదార్థాలతో రూపొందించిన ఈ విగ్రహాల్లో విత్తనాలను ఉంచినట్లు తెలిపారు. పూజ అనంతరం విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదిగేలా వీటిని రూపొందించినట్లు వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందని రవీందర్ యాదవ్ అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా మట్టి, సహజ పదార్థాలతో తయారు చేసే సీడ్ గణపతులను ప్రజలు ప్రోత్సహించాలని కోరారు.

ప్రతి ఇంటికి ఒక సీడ్ గణపతి చేరేలా కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విగ్రహాల పంపిణీతో పాటు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, స్వచ్ఛమైన నీటి వనరుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కేటీఆర్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభం కావడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని రవీందర్ యాదవ్ తెలిపారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భక్తితో గణపతిని పూజిద్దాం.. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి కుటుంబం సీడ్ గణపతిని స్వీకరించి, పూజ అనంతరం ఒక మొక్కను పెంచితే పర్యావరణ పరిరక్షణకు గొప్ప తోడ్పాటు అందించినట్లవుతుందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here