శేరిలింగంపల్లి, సెస్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు అట్టేపల్లి రామప్రభు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకులు మాధవరం రంగారావు, సిద్ధనబోయిన పురుషోత్తం యాదవ్ ఆధ్వర్యంలో రామప్రభు బీఆర్ఎస్లో చేరారు. రామప్రభుతోపాటు అడప అజయ్, సోంటెనా గంగాధర్, రాజు, రాజేష్, శ్రీశైలం, ఏఆర్పీ టీమ్ సభ్యులు తదితరులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సుదీర్ఘకాలంగా ప్రజల మధ్య ఉంటూ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామప్రభు రాజకీయాల్లోకి రావడం శేరిలింగంపల్లి రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్న తనకు, ప్రజా సేవను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రాజకీయ వేదిక అవసరమని భావించి బీఆర్ఎస్లో చేరినట్లు రామప్రభు తెలిపారు. బీఆర్ఎస్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్య చేసిన సేవకు ఇప్పుడు రాజకీయ బలం తోడైంది. ప్రజల గొంతుకగా మరింత బలంగా ముందుకు సాగుతాం. పదవి కోసం కాదు.. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. ప్రజల నమ్మకమే మా బలం.. బీఆర్ఎస్ జెండా కింద ప్రజా సేవే మా లక్ష్యం అని రామప్రభు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు మారబోయిన రవికుమార్ యాదవ్, కలిదిండి రోజా, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, గోపరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.





