శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర పుణ్యక్షేత్రమని, ప్రజాస్వామ్యానికి వేదికగా ఉన్న శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రతి విషయాన్నీ రచ్చ చేయడం, ప్రతి సూచనను రాజకీయ స్టంట్‌గా మార్చడం బీఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దూషించడాన్ని, అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్లోగన్స్ ఉన్న బ్లాక్ టీ-షర్టులతో రావద్దని పోలీసులు సూచిస్తే టీ-షర్ట్ విప్పేసి బనియన్‌తో రావడం ఏం రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు ఇంతకంటే మంచి మార్గాలు లేవా అని నిలదీశారు. ఇన్నేళ్ల రాజకీయ అనుభవం తర్వాత కూడా అసెంబ్లీ గౌరవాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోలేదా అని అన్నారు. మంత్రిగా, ఫ్లోర్ లీడర్‌గా, సీనియర్ ప్రజాప్రతినిధిగా పనిచేసిన వారికి అసెంబ్లీకి ఎలా రావాలి, ఎలా ప్రవర్తించాలి అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పోలీసులతో ఎలా వ్యవహరించాలి, శాసనసభలో ఎలాంటి హుందాతనం పాటించాలి అనే కనీస బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉండాలని పేర్కొన్నారు. మహిళా ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరూ ఉన్న సభకు బనియన్‌తో రావడం ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని జగదీశ్వర్ గౌడ్ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే హక్కులతో పాటు బాధ్యత కూడా ఉంటుందని అన్నారు. నిరసనలో హుందాతనం, రాజకీయాల్లో సంస్కారం ఉండాలని సూచించారు. అసెంబ్లీని రచ్చబండ చేయడం రాజకీయ పోరాటం కాదు.. చర్చకు బదులు చిల్లర ప్రదర్శన చేయడం ప్రతిపక్ష బాధ్యత కాదు అని జగదీశ్వర్ గౌడ్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, నాయకులు మహిపాల్ యాదవ్, సయ్యద్ గౌస్, కట్ల శేఖర్ రెడ్డి, వివిధ డివిజన్ల అధ్యక్షులు అలీ, జహంగీర్, బాష్పక యాదగిరి, నగేష్ నాయక్, శేఖర్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, హరికిషన్, అంతి రెడ్డి, పట్వారీ శశిధర్, యలమంచి ఉదయ్ కిరణ్, గంగల గణేష్ యాదవ్, అయాజ్ ఖాన్, పోచన్న, సయ్యద్ బాబా, లక్ష్మణ్, కృష్ణ, చిన్న, కార్తీక్ గౌడ్, నారాయణ, ప్రభాకర్, పద్మారావు, రవి కుమార్ నాయీ, సుధాకర్, రాజేష్, శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సేవాదళ్ నియోజకవర్గ అధ్యక్షుడు నర్సింగ్ రావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాకీర్, ప్రధాన కార్యదర్శి నరేందర్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు సౌందర్య రాజన్, సాజిద్, రషీద్, ఇస్మాయిల్, జావేద్, ముజీబ్, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షులు పార్వతి, జయ, అనిత, తన్వీర్ బేగం, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు చంద్రమౌళి, రవి కుమార్ గౌడ్, కిరణ్, సాయి కిషోర్, వాసు తదితరులు పాల్గొన్నారు.





