సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వనం సుధాకర్ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, విముక్తి, వెట్టి చాకిరీ నిర్మూలన, జాగీర్దారీ, పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు, లెవీ–గల్లాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగిందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలు చేసిన త్యాగాలతో ఈ పోరాటం కొనసాగిందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో సుమారు 4 వేల మంది తెలంగాణ బిడ్డలు వీరమరణం పొందారని, 3 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని, 10 లక్షల ఎకరాల భూమిని ప్రజలకు సాధించి పెట్టిందని ఆయన తెలిపారు.

ఈ చారిత్రక పోరాట వారోత్సవాలను యంసిపిఐ(యు), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. వారోత్సవాల ప్రారంభ సభ సెప్టెంబర్ 10న హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్ బి.ఎన్. హాల్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు గ్రామ, మండల, డివిజన్ కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించి, సెప్టెంబర్ 17న అన్ని జిల్లాల కేంద్రాల్లో పెద్ద ఎత్తున వారోత్సవాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న శేరిలింగంపల్లి ఎంఆర్వో కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించనున్నట్లు యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలో దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల కబ్జాలను అరికట్టడంతో పాటు అధికారుల అవినీతికి చెక్ పెట్టాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహించే మహాధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మైదం శెట్టి రమేష్ కోరారు. ఇస్లావత్ దశరథ్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, కర్ర దానయ్య, అంగడి పుష్ప, జి. శివాని, జి. లలిత, కన్నా శ్రీనివాస్, డి. రంగస్వామి, బి.కె. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here