శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదంలో కుడికాలు కోల్పోయి గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగుడు తిరుమాల్కు తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ చొరవతో కృత్రిమ కాలు అందించారు. గుంటూరుకు చెందిన తిరుమాల్ విధి నిర్వహణలో జరిగిన ప్రమాదంలో కుడికాలు కోల్పోయారు. అప్పటి నుంచి రోజువారీ పనులు చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. తిరుమాల్ పరిస్థితిని నరేష్ మెరుగు శివకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.

విషయం తెలుసుకున్న శివకృష్ణ వెంటనే స్పందించి, సహాయం అందించేందుకు భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునరావాస కేంద్రం ట్రస్ట్‌ను సంప్రదించారు. ట్రస్ట్ సహకారంతో తిరుమాల్కు కృత్రిమ కుడికాలు అందేలా చర్యలు చేపట్టారు. మంగళవారం కృత్రిమ కాలును అమర్చడంతో తిరుమాల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా చేసుకునే అవకాశం లభించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, టెక్నీషియన్లు రఘు, మధు, స్వామి, చింతల విజయ్ కుమార్, రఘువరన్ తదితరులు సహకరించారు.
ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ.. సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అవసరంలో ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్‌కు దివ్యాంగుల తరఫున మెరుగు శివకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





