శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాజ గాన సభ ప్రధాన హాలులో స్వర సప్త సంగీత వాద్య నృత్య సమ్మేళనం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రోజంతా కొనసాగిన ఈ సాంస్కృతిక వేడుకలో భారతీయ శాస్త్రీయ సంగీతం, వాద్య సంగీతం, నృత్య కళలకు చెందిన పలువురు ప్రతిభావంతులైన కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి బీసీ కులాల ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన చిన్నారులను గుర్తించి, తదుపరి తరం కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కళారంగంలో ప్రతిభ కనబరిచిన వారికి నాట్య రాయలి పురస్కారం, శాస్త్రీయ కళలకు విలువైన సేవలందిస్తూ, కళాకారులను తీర్చిదిద్దుతున్న గురువులకు నాట్య శిరోమణి పురస్కారం అందించడం అభినందనీయమన్నారు.

కళాకారుల సంగీత, నృత్య, వాద్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళల గొప్పతనాన్ని చాటిచెప్పేలా ఈ వేడుక సాగింది. ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడంతోపాటు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు ఉపయోగపడతాయని బేరి రామచందర్ యాదవ్ పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు బి. నాగేంద్ర యాదవ్, ఇన్‌ఛార్జ్ బి. దివ్యలక్ష్మిలను ఆయన అభినందించారు. శ్రీ వాగ్దేవి వాద్య సంగీత కళా నృత్య సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించాలని, కళలను ప్రోత్సహిస్తున్న సంస్థలకు ప్రభుత్వాలు అవసరమైన సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమానికి సహకరించిన కళాకారులు, గురువులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అతిథులు, కళాభిమానులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోచబీయిన సురేష్ యాదవ్, యాదగిరిగుట్ట దేవస్థానం డైరెక్టర్ల బోర్డు సభ్యుడు పోచబోయిన ఈశ్వరామ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటాల జంగయ్య, ప్రజాపతి రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త డాక్టర్ వీర భోగావసంత రాయలు, మునుగోడు నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మారమోని శ్రీశైలం యాదవ్, రాజారావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





