శేరిలింగంపల్లి, ఆగస్టు 30 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అదనపు వసతులు అందుబాటులోకి రానున్నాయి. రౌండ్ టేబుల్ ఇండియా హార్ట్ 134 ఫౌండేషన్ CSR నిధులతో సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో 8 అదనపు తరగతి గదుల భవనం నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పాఠశాలలో రూ.కోటి CSR నిధులతో 8 అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య పునాది వంటిదని పేర్కొన్నారు. కొత్త భవనాన్ని అన్ని హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించడంతో పాటు టాయిలెట్ బ్లాక్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను సూచించారు.
CSR ప్రతినిధులు సామాజిక బాధ్యతతో విద్యారంగానికి సేవ చేయడం అభినందనీయమని గాంధీ అన్నారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఫౌండేషన్ సభ్యుల సేవలు మరెందరికో ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని గాంధీ తెలిపారు. మియాపూర్‌లో 10 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియన్ పాఠశాల ఏర్పాటుకు ఇటీవల శంకుస్థాపన జరిగిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొండాపూర్, చందానగర్‌లో కోర్ అర్బన్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని వసతులతో తీర్చిదిద్ది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేస్తామని, విద్యార్థులు, ఉపాధ్యాయులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని గాంధీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రౌండ్ టేబుల్ ఇండియా హార్ట్ 134 ఫౌండేషన్ చైర్మన్ వివేక్, సచిన్ మెతుకు, వైస్ చైర్మన్ కృష్ణ అగర్వాల్, సెక్రటరీ వికాస్ పామునుగుల్ల, ట్రెజరర్ ఆయుష్ అగర్వాల్, IPC స్మితా, సభ్యులు సానిత్ గాంధీ, రమణ్, విక్రమ్ సూర్య తేజ, మన్మిత్, నమన్, అంకిత్, గౌరవ్, కునాల్, గిరీష్, రమేష్ కుమార్, హెడ్‌మాస్టర్ సరిత, నాయకులు గణేష్ ముదిరాజు, మంత్రిప్రగడ సత్యనారాయణ, సురేష్, వెంకటేష్, వేణుగోపాల్ రెడ్డి, రవి, శ్రీనివాస్, పింటు, మల్లేష్, జగదీష్, సల్లావుద్దీన్, రాజు, నాగేష్, అనిల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.





