కాంగ్రెస్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ.. బీఆర్‌ఎస్‌ నేత నవతారెడ్డి తీవ్ర విమర్శలు

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 30 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకురాలు, మాజీ కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆయ‌న‌ బీఆర్‌ఎస్‌ (టీఆర్ఎస్‌) పార్టీలోనే ఉన్నానని చెబుతూ.. ప్రతిపక్ష హోదాలో PAC చైర్మన్‌ పదవిని అనుభవిస్తున్నార‌ని, కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత కార్యక్రమాల్లో ఆ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం దారుణమని ఆమె ఆరోపించారు. స్వలాభం కోసం ఆయన చేస్తున్న అవకాశవాద రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ప్రకటన విడుదల చేశారు.

మియాపూర్‌ డివిజన్‌ పరిధిలోని నరేన్‌ గార్డెన్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణుల కోసం స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌-2 కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి వి. జగదీశ్వర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ బీఎల్‌ఏలు, కార్యకర్తలకు ఓటరు నమోదుపై దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, మీనాక్షి నటరాజన్‌, మహేష్‌ గౌడ్‌ చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలున్న వేదికపై ఎమ్మెల్యే గాంధీ పాల్గొనడంపై నవతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇంకా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని, పార్టీ మారలేదని పదేపదే చెబుతున్న గాంధీ.. కాంగ్రెస్‌ నాయకులతో కలిసి అదే పార్టీ కార్యక్రమంలో వేదిక పంచుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఎవరిని మెప్పించేందుకు ఆయన ఈ రాజకీయ నాటకాలు ఆడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆరెకపూడి గాంధీ ద్వంద్వ వైఖరితో శేరిలింగంపల్లి ప్రజలను మభ్యపెడుతూ, మోసం చేస్తున్నారని నవతారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తి.. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఓటు హక్కు మన హక్కు.. ఓటు రక్షణ మన బాధ్యత అంటూ కాంగ్రెస్‌ నాయకులు వేదికపై ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుండగా, అదే వేదికపై ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే కూర్చోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె ఎద్దేవా చేశారు.

పదవులు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే అరెకపూడి గాంధీ ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలకు పాల్పడుతున్నారని నవతారెడ్డి విమర్శించారు. ఆయన రాజకీయ అవకాశవాదాన్ని, మోసపూరిత వైఖరిని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని, తనను నమ్మి ఓటేసిన నియోజకవర్గ ప్రజలను ఏకకాలంలో మోసం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ ఇప్పటికైనా కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని బహిరంగంగా అంగీకరించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రజలకు క్షమాపణ చెప్పడంతోపాటు PAC చైర్మన్‌ పదవికి రాజీనామా చేయాలని బొబ్బ నవతారెడ్డి కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here