శేరిలింగంపల్లి, ఆగస్టు 26 (నమస్తే శేరిలింగంపల్లి): ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ఖాజా నగర్‌లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ముస్లింలందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సోదరభావం, ధర్మచింతన ప్రతి ఒక్కరిలో ఉండాలని మహమ్మద్ ప్రవక్త బోధించారని పేర్కొన్నారు. సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్ష్యంగా ప్రవక్త చేసిన బోధనలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ ఆయన బోధించిన మానవత్వం, కరుణ, ప్రేమ, సోదరభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని గాంధీ సూచించారు. ప్రపంచ శాంతి, మానవ సమానత్వం కోసం ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గం అందరికీ ఆదర్శమని అన్నారు. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని రబీ-ఉల్-అవ్వల్ మాసం 12వ రోజున మిలాద్-ఉన్-నబీ వేడుకలను నిర్వహిస్తారని, మహమ్మద్ ప్రవక్తను స్మరించుకుంటూ ఆయన బోధనలు, మానవతా విలువలను గుర్తుచేసుకోవడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ముస్లింలు రంజాన్, బక్రీద్ తర్వాత ఘనంగా జరుపుకునే పండుగల్లో మిలాద్-ఉన్-నబీ ఒకటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ముస్లింలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.





