శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురైన ప్రధానోపాధ్యాయురాలు రూపా రెడ్డి కుటుంబాన్ని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ప్రతినిధులు పరామర్శించారు. తుర్కయంజాల్‌లోని ఆమె నివాసం వద్ద ఏర్పాటు చేసిన రూపా రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల దాడిలో మృతి చెందడం అత్యంత విచారకరమన్నారు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించడంలో ప్రస్తుత సమాజంలోని అన్ని వర్గాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ చూపకపోవడం వల్లే కొందరు విద్యార్థులు చెడు మార్గాల్లోకి వెళ్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థుల్లో పెడధోరణులు, విపరీత ప్రవర్తనలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరిస్తే చిన్నతనం నుంచే పిల్లలను సన్మార్గంలో నడిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే తల్లిదండ్రుల అతిగారాబం కూడా ఇందుకు అడ్డంకిగా మారుతోందన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణపై ప్రభుత్వ యంత్రాంగం మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్.ఎన్. రెడ్డి అన్నారు. ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తుండటంతో వాటికి బానిసలవుతున్న విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి కె. శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాణి, వి. సుదర్శన్ రెడ్డి, రామకృష్ణతో పాటు కొండా మల్లేపల్లి ట్రస్మా సభ్యులు, నల్గొండ ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు.





