శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్, ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు నల్లగండ్లలోని శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వగృహానికి పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (యాదగిరిగుట్ట) పాలకమండలి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు, ఎల్బీనగర్ మాజీ కార్పొరేటర్ పోచబోయిన ఈశ్వరమ్మ రాగం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గం నలుమూలల నుంచి పలువురు సీనియర్ నాయకులు నల్లగండ్లకు చేరుకుని రాగం నాగేందర్ యాదవ్, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాగం సుజాత యాదవ్ మృతి తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా మహిళా లోకానికి తీరని లోటని అన్నారు. సామాజిక సేవా రంగంలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని కొనియాడారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, రాగం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.





