శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ పరిధిలోని అంజయ్యనగర్‌లో 40 గజాల స్థలంలో ఏకంగా 8 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టడం, ఆ భవనం కుప్పకూలిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. బొటానికల్ గార్డెన్స్ ఎదురుగా, మాదాపూర్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు భవనాలు కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

అక్రమ నిర్మాణాలకు కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని, ఒక్కో అంతస్తుకు రూ.2 లక్షల వరకు లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని స్థానికులు, ప్రజాసంఘాలు కోరుతున్నాయని అన్నారు. 5 నుంచి 8 అంతస్తుల వరకు అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి, వాటిని హాస్టళ్లుగా వినియోగిస్తూ భారీగా ఆదాయం ఆర్జిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని, భూమి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవడంలో సంబంధిత విభాగాలు విఫలమవుతున్నాయని అన్నారు.

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిర్మాణ అనుమతులు, అధికారుల తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. హైడ్రా, GHMC, CMC అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.





