శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన ఆరు అంతస్తుల భవనం కూలిపోవడంతో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రవికుమార్ యాదవ్.. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని కోరారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాలకు అంజయ్య నగర్ సమీపంలో ఉండటంతో అద్దెల కోసం 50, 60, 80, 100 గజాల స్థలాల్లోనే 6, 7, 8, 9 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారని విమర్శించారు. అక్రమ, నాణ్యత లేని నిర్మాణాలపై గతంలో అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్ ప్రాంతాల్లో పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఇలాంటి నిర్మాణాల కారణంగా పార్కింగ్ సమస్యలు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో వాటర్ ట్యాంకర్లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం అక్రమ నిర్మాణాల కారణంగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని రవికుమార్ యాదవ్ అన్నారు. ఇకనైనా ప్రభుత్వం, హైడ్రా, సీఎంసీ అధికారులు మేల్కొని అంజయ్య నగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన అధిక అంతస్తుల భవనాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్మాణాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రవి నాయక్, జిల్లా అధికార ప్రతినిధి ఆంజనేయులు సాగర్, నాయకులు మన్యం కొండ సాగర్, ధనరాజ్, సరోజ రెడ్డి, ఆమని, మల్లికార్జున్‌తో పాటు స్థానిక కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






