శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోన్లో కార్యాలయ పరిపాలనను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో పలు నూతన వసతులు, విభాగాలను ప్రారంభించారు.

సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో నూతన సౌకర్యాలను ప్రారంభించారు. క్షేత్రస్థాయి సేవలను మరింత వేగవంతం చేసేందుకు నూతన వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జోనల్ ఆఫీస్ లాబీ, శేరిలింగంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం, 150 అడుగుల జాతీయ జెండా, ఆడిటోరియం, శానిటేషన్ విభాగం కార్యాలయం, ఘన వ్యర్థాల నిర్వహణ (SWM) విభాగం కార్యాలయం, ఆరోగ్య విభాగం కార్యాలయం, ఆఫీస్ పార్కులను ప్రారంభించారు.

నూతన వసతులు, అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో క్షేత్రస్థాయిలో చేపట్టే పనులు మరింత వేగవంతమవుతాయని అధికారులు తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో ప్రజలకు పౌర సేవలను మరింత సమర్థవంతంగా, వేగంగా అందించడంతో పాటు కార్పొరేషన్ పనితీరును మెరుగుపరచడంలో ఇవి కీలకంగా దోహదపడతాయని కమిషనర్ జి. సృజన తెలిపారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోనల్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.






